Thursday, 31 October 2013

డయాబెటిస్ విషయంలో .... ముందు జాగ్రత్తలు ...!

జీవనశైలిలో మార్పులు, వ్యాయామం కొరవడటం మూలంగా షుగర్ వ్యాధి చిన్న వయసులోనే వచ్చిపడుతోంది. ఒక్కసారి షుగర్ వ్యాధి ఉందని నిర్ధారణ అయితే దాన్ని అదుపులో ఉంచుకోవడానికి జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఇతర అవయవాలపైన షుగర్ వ్యాధి ప్రభావం ఉన్నదీ, లేనిదీ తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకే షుగర్ వ్యాధి వచ్చిన తరువాత బాధపడటం కన్నా రాకుండా చూసుకోవడం అన్ని విధాలా ఉత్తమం.

షుగర్ వ్యాధి రెండు రకాలు.

ఒకటి టైప్ 1 డయాబెటిస్. ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో ఇన్సులిన్ తయారీ తగ్గిపోతుంది.

రెండవది టైప్ 2 డయాబెటిస్. ఇందులో ఇన్సులిన్ ఉత్పత్తి జరిగినా శరీరం దానిని తీసుకోదు. 90 శాతం మందిలో ఈ రకమైన డయాబెటిస్ కనిపిస్తోంది.

ప్రధాన లక్షణాలు

షుగర్ వ్యాధి బారినపడిన వారిలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. అతిగా దాహం వేయడం, ఆకలి ఎక్కువగా ఉండటం, మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళ్లాల్సిరావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలతో పాటు బరువు తగ్గిపోవడం జరుగుతుంది.
ముఖ్య కారణాలు
షుగర్ వ్యాధి రావడానికి లైఫ్‌స్టయిల్ ప్రధాన కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా పని ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, సమయపాలన లేని భోజనం వంటివి షుగర్ వ్యాధికి కారణ మవుతున్నాయి. ఈ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చేఅవకాశం కూడా ఉంది.

సింపుల్ టెస్ట్
షుగర్ వ్యాధి ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ పరీక్ష చేయించాలి. అంటే భోజనం చేయక ముందు ఒకసారి, చేసిన తరువాత ఒకసారి రక్తపరీక్ష చేయించాలి. భోజనం చేయక ముందు ఇచ్చిన శాంపిల్స్‌లో విలువ 126 కన్నా తక్కువ ఉండాలి. తిన్న తరువాత 140 నుంచి 200 మధ్య ఉండాలి. తినకుముందు 100 కన్నా తక్కువ, తిన్న తరువాత 140 కన్నా తక్కువ ఉంటే షగుర్ వచ్చే అవకాశాలు లేవనే చెప్పవచ్చు. రాండమ్ బ్లడ్ షుగర్ పరీక్షలను బేస్ చేసుకుని షుగర్ వ్యాధిని నిర్ధారణ చేయలేం. గర్భిణులు తప్పనిసరిగా షుగర్ పరీక్ష చేయించుకోవాలి. వీరికి ముందుగా 75 గ్రా. గ్లూకోజ్ తినిపించి మూడు సార్లు శాంపిల్ తీసుకుంటారు. జీరో అవర్‌లో 90కన్నా తక్కువ, 1 గంట తరువాత 180 కన్నా ఎక్కువ, 2 గంటల తరువాత 150 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా డెలివరీ తరువాత గ్లూకోజ్ స్థాయిలు నార్మల్‌కి వస్తాయి. కొంత మందిలో మాత్రం షుగర్ పెరిగే అయ్యే అవకాశం ఉంటుంది.

కొన్ని సమస్యలు

షుగర్ వ్యాధి దీర్ఘకాలంగా కొనసాగినప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. గుండె సమస్యలు, కంటి సమస్యలు, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొందరిలో కాళ్లలో తిమ్మిర్లు వస్తుంటాయి. ఇటువంటి వారు తప్పనిసరిగా అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ వ్యాధి నియంత్రణలో ఉన్నా సమస్యలు రావచ్చు. తరచుగా పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫలితంగా రక్తసరఫరా తగ్గిపోయి అవయవాలు దెబ్బతింటాయి. కాళ్లకు రక్త సరఫరా తగ్గిపోతే కింది భాగం నల్లగా మారుతుంది. కణాలన్నీ చనిపోయి గాంగ్రిన్‌గా మారుతుంది. ఈ పరిస్థితుల్లో కాలు తీసివేయాల్సి వస్తుంది. డయాబెటిస్ రోగులకు కాలుకు ఏదైనా గుచ్చుకున్నా తెలియదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. పాదాలు రోజూ పరీక్షించుకోవాలి. ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి.

జీవితాంతం మందులు

షుగర్ వ్యాధి నిర్ధారణ అయితే జీవితాంతం మందులు లేదా ఇన్సులిన్ ఇంజక్షన్‌లు వాడాల్సి ఉంటుంది. రోగి పరిస్థితిని బట్టి ఏ ఇన్సులిన్ ఇంజక్షన్ ఇవ్వాలనేది డాక్టర్ నిర్ణయిస్తారు. ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తుంటే మాత్రల డోస్ పెంచాల్సిన అవసరం ఉండదు. అవేమీ పాటించకపోతే మందుల డోస్ పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది.

తప్పనిసరి జాగ్రత్తలు

ప్రతి రోజు 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడవడం చేయాలి. వారంలో నాలుగు నుంచి అయిదు రోజులయినా వ్యాయామం చేయాలి.

దుంపకూరలు తినకూడదు, కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఆపిల్, బత్తాయి, జామ, బొప్పాయి, కమల పండ్లు తినవచ్చు. మామిడి, అరటి పండ్లు తినకూడదు.

Courtesy-Aayuraarogyalu

No comments:

Post a Comment